రానున్న ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ తమ పార్టీ అభ్యర్థులను ఎవ్వరినీ ప్రకటించలేదు. కానీ ఓ నేత మాత్రం తమ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకున్నారు. పెడన నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేత బూరగడ్డ వేదవ్యాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా వేదవ్యాస్ మాట్లాడుతూ.. పెడన సీటుపై తమ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ఎవరికీ హామీ ఇవ్వలేదని కానీ తాను మాత్రం ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నానని వెల్లడించారు. చంద్రబాబు కూడా తన కోరికను కాదనరనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. త్వరలోనే తమ పార్టీ అధినేతని కలిసి నియోజకవర్గంలో పరిస్థితులు వివరిస్తానన్నారు. రాజకీయ పరిణామాలు, సమీకరణాలు నేపథ్యంలో ఈ సారి ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నానన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని... తమ అధినేత కూడా తనను ప్రోత్సహిస్తారనే నమ్మకం ఉందని బూరగడ్డ వేదవ్యాస్ వెల్లడించారు.