దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రతిపక్ష టీడీపీ గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. సోమవారం ప్రజా గాయకుడు పీ.వి రమణ రచించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అనే పాటను నక్కా ఆనందబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ పోరాటాలకు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. దళితులకు టీడీపీ తీసుకువచ్చిన 27 పధకాలు తీసేశారని మండిపడ్డారు. వైసీపీ ఎంతో మంది దళితులను పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. నూటికి 80 శాతం మంది దళితులు జగన్‌కు ఓటు వేశారని.. అయితే వైసీపీ ప్రభుత్వంలో దగాపడింది దళితులే అని అన్నారు. అంబేద్కర్ పేరు తీయడాన్ని వైసీపీలో ఉన్న దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారన్నారు. సబ్ ప్లాన్ నిధులతో దళిత వాడల్లో టీడీపీ వేల కిలోమీటర్లు రోడ్లు వేసిందని చెప్పుకొచ్చారు. వైసీపీ కనీసం 8 మీటర్లు రోడ్డు వేసిందా అని ప్రశ్నించారు. అమ్మవడి పేరుతో ఇంట్లో ఒకరికి ఇస్తే మిగతా పిల్లలు పనులకు వెళ్లాలా అని నిలదీశారు. అచ్చెన్న, సుధాకర్ ఇలా ఎంతో మంది దళితుల చావుకు వైసీపీ కారణం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ రచించిన ఈ పాట ద్వారా దళితుల్లో చైతన్యం రావాలని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.