ప్రకాశం జిల్లాలో కరోనా కారణంగా గత రెండేళ్లుగా కంపకళ్లి జాతరను నిర్వహించలేదు. ఐతే ఈ సంవత్సరం హనుమంతునిపాడు మండలం, చిన్న గొల్లపల్లిలోని చెన్నకేశవస్వామి ఉత్సవాలు ఐదురోజులపాటు నిర్వహించారు. చెన్నకేశవస్వామికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ముళ్లకంపపై నుంచి దొర్లడం ఇక్కడ ప్రత్యేకత. ఉత్సవాలు చివరి రోజున కంపకళ్లి జాతరను నిర్వహించడం ఆనవాయితి.గతంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ముళ్లకంపపై నుంచి దొర్లేవారు. అయితే కోర్టు ఆదేశాలతో చిన్నారులు ముళ్లకంపపై నుంచి దొర్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఆచారంలో భాగంగా పెద్ద వాళ్ళు మాత్రమే ముళ్లకంపపైనుంచి దొర్లి తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరునాళ్ల సంప్రదాయ ప్రకారం చక్క వారి వంశస్థులు పెట్టే పొంగళ్లతో మొదలవుతాయి. చివరి రోజు కంపకళ్లి అనే కార్యక్రమం జరుగుతుంది.