విశాఖపట్నం, గోపాలపట్నం బాజీ జంక్షన్ ప్రాంతానికి చెందిన హేమంత్(35) మేఘాద్రిగడ్డ డామ్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే హేమంత్ గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యాలపై మానసికంగా ఇబ్బంది పడటంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న సాయంకాలం మృతుడు హేమంత్ ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, చెప్పులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ వద్ద కనిపించడంతో అనుమానం వచ్చి గాలింపు చర్యలు చేపట్టగా.. ఈరోజు ఉదయం హేమంత్ మృతదేహం లభ్యమైంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మృతుడు హేమంత్‌కు భార్య, బాబు, పాప ఉన్నారు. హేమంత్ మృతి వార్త తెలుసుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.