ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలపై అదనపు భారం తగదంటూ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. హజ్ యాత్రకు ప్రభుత్వం సబ్సిడీ భరించాలని లోకేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికులతో పోల్చితే విజయవాడ నుంచి వెళ్లే ఒక్కొక్కరిపై రూ.83,000 ఆదనపు భారం పడుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు రూ.2,40,000 వెళ్లే ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ మొత్తం రూ.3,88,580 చేసిందని నారా లోకేష్ వెల్లడించారు. పొరుగున ఉన్న హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళాలంటే రూ.3,05,000 మాత్రమే ఖర్చు అవుతోందన్నారు. ఏపీ నుంచి వెళ్లే ఒక్కో ప్రయాణికుడి మీద రూ.83,000 ఆదనపు భారం మోపటం సబబు కాదన్నారు. పేద ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినంత సబ్సిడీని భరించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.