జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో రైతులతో ముఖాముఖి సమావేశం తర్వాత మంగళగిరి చేరుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దళారీ వ్యవస్థ రైతులను నాశనం చేస్తోందని, లాభాల పేరుతో రైతులను దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వం సకాలంలో బస్తాలు అందించడం లేదని రైతులు వాపోయారు. అధికారులు సహకరించి ముందుగానే బస్తాలు ఇస్తే బాగుండేదని రైతులు వాపోతున్నారని వివరించారు. నేను వస్తున్నానని తెలిసి రాత్రికి రాత్రే బస్తాలు అందించారని పవన్ ఆరోపించారు. సంక్షోభం తర్వాత చర్యలు తీసుకుంటే తప్ప నివారణకు కృషి చేయలేకపోతున్నారని విమర్శించారు. ఒక్క మంత్రి అయినా సహాయపడకపోగా, రైతులను అనుచిత మాటలు అనడం బాధ కలిగించిందని తెలిపారు. "మేం అన్నం పెడుతున్నాం... మాకేంటి ఈ బాధలు?... మేం ఏమైనా క్రిమినల్స్ లా కనిపిస్తున్నామా? అని రైతులు ఆక్రోశిస్తున్నారు. వ్యవసాయ రంగానికి కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాజమండ్రిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ కార్యాలయంలో పలువురు రైతులతో సమావేశమయ్యాం’’ అని పవన్ కల్యాణ్ వివరించారు.