ఏపీలోని వాలంటరీ వ్యవస్థ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను లీడర్లుగా చేస్తానని గతంలో చెప్పానని, ఆ మాట గుర్తు పెట్టుకోవాలని సీఎం జగన్ అన్నారు. ఏపీలోని విజయవాడలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ జగన్ పెట్టుకున్న నమ్మకం వాలంటీర్ వ్యవస్థ. ఎక్కడా లంచాలు లేవు.. వివక్ష చూపలేదు. లంచాలు, అవినీతి లేని తులసి మొక్కలాంటిది వాలంటీర్ల వ్యవస్థ’’ అని చెప్పారు.
‘‘వాలంటీర్లను ఉద్దేశించి నేను మొట్టమొదట ఇచ్చిన స్పీచ్ మీకు గుర్తు ఉందా.. మిమ్మల్ని లీడర్లుగా చేస్తానని చెప్పాను. ఆ మాట గుర్తు పెట్టుకోండి. నవరత్నాల ఫిలాసఫీకి సారథులు మీరు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా, ప్రజలందరికీ మోటివేటర్లుగా, మన ప్రభుత్వానికి అండగా మీరందరూ నిలబడాలని కోరుతున్నా’’ అని అన్నారు.
ఏపీలో ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులుగా వాలంటీర్లు ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నట్లు జగన్ తెలిపారు. అవ్వాతాతలకు మంచి మనుమరాలు, మనుమడిగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. 64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులని వాలంటీర్లను కొనియాడారు.