ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన టిడిపి నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 23, 2023, 08:29 PM

దిగంగత మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సాయంత్రం టీడీపీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమ తదితరులు రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి అవినాశ్ రెడ్డి వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. అవినాశ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. ఎవరో ఆకు రౌడీలు వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదని బెదిరిస్తే అరెస్ట్ చేయకుండా వెనక్కి వచ్చేస్తారా? అని నిలదీశారు. 


"రాష్ట్రంలో టీచర్లు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే వాళ్లను నియంత్రించారు. టీడీపీ నేతలు రోడ్డు మీదికి వస్తే కంట్రోల్ చేశారు. కమ్యూనిస్టులు, ఇతర విపక్ష నేతలు రోడ్ల మీదికి రాకుండా గృహ నిర్బంధాలు చేశారు కదా. అవినాశ్ రెడ్డి కాన్వాయ్ వందలాంది వాహనాలతో ఊరేగింపుగా వస్తుంటే ఏం చేస్తున్నారు?


వీటన్నింటిపై ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించాం. ఇవన్నీ చూశాక ఆయన ఆశ్చర్యపోయారు. నిజమా అని అడిగారు. నిజమే సార్ అని చెప్పాం... కావాలంటే వాళ్ల మీడియా కరపత్రం, వాళ్ల టీవీ చానల్ తప్ప మిగతా చానళ్లు చూడాలని చెప్పాం. 


ఏపీలో సీబీఐ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. ఎక్కడైనా సీబీఐ వస్తే స్థానిక పోలీసులు భయపడతారు. కానీ జగన్ పాలనలో స్థానిక పోలీసులే సీబీఐ వాళ్లను బెదిరిస్తున్నారు. లోకల్ పోలీసులే దర్యాప్తు అధికారికి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం... సీబీఐ పరిస్థితి ఇంత దయనీయంగా ఏపీలోనే ఉందా, లేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందా? 


పశ్చిమ బెంగాల్ లో మంత్రులను అరెస్ట్ చేసినప్పుడు సీబీఐ బాగానే పనిచేసిందే! ఢిల్లీలో డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసేటప్పుడు ఒక కార్లో వెళ్లి లాక్కుని వచ్చారే! గతంలో టెలికాం మంత్రిగా ఉన్న రాజాను నలుగురెళ్లి లాక్కొచ్చారే... నిన్నగాక మొన్న కర్ణాటకలో ఓ మంత్రిని లాక్కొచ్చారే... మరి ఏపీలో ఎందుకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు?" అని వర్ల రామయ్య ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com