గత 2019లో జరిగిన జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఎన్నో మలుపులు తిరుగుతోందని టిడిపి సీనియర్ నేత బొండా ఉమ వెల్లడించారు. గూగుల్ టేకౌట్ వంటి అధునాతన టెక్నాలజీతో వెల్లడైన వాస్తవాలతో ప్రపంచం నివ్వెరపోయిందని అన్నారు.
"వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి సాక్ష్యాలు చెరిపివేసినట్టు సీబీఐ తేల్చింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఎక్కడా బెయిల్ లభించలేదు. ఈ కేసులో అవినాశ్ వందల కోట్లు ఖర్చు చేశాడు. అతడికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సీబీఐ ఇటీవల నోటీసులు ఇస్తే తల్లిని అడ్డంపెట్టుకుని దొంగ నాటకానికి తెరదీశాడు. ఇదంతా తాడేపల్లి ఆదేశాల మేరకు జరుగుతున్న డ్రామా.
ఒక హత్య కేసులో ముద్దాయిని కాపాడేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్న విషయం గవర్నర్ కు వివరించాం. ఎక్కడైనా అవినీతిపరులు, నేరస్తులు, స్కాంలు చేసినవారు, రాజకీయనేతలు సీబీఐని చూసి భయపడతారు... కానీ రాష్ట్రంలో వైసీపీని చూసి సీబీఐ భయపడే పరిస్థితి ఏర్పడింది. నిన్న జరిగిన పరిణామాలతో సీబీఐ అధికారులు 8 గంటల పాటు ఎస్పీ ఆఫీసులోనే కూర్చుండి పోవాల్సి వచ్చింది. సీబీఐ అధికారులకు ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు?
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన రౌడీలు కర్నూలులో విచ్చలవిడిగా తిరిగారు.... మీడియా వాళ్లను కూడా కొట్టారు... కెమెరాలు ధ్వంసం చేసి చానళ్ల ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేశారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేసేందుకు వస్తే వారికి కనీస భద్రత ఇవ్వలేకపోయారు" అంటూ బొండా ఉమ నిప్పులు చెరిగారు.