ముచ్చటగా మూడుసార్లు సంతకాలు చేసినా నిధులు మాత్రం విడుదల కాలేదని నెల్లూరు రూరల్ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేశానని ఆయన అన్నారు. కమ్యూనిటీ హాల్ కోసం ముఖ్యమంత్రి జగన్ నెల రోజులుగా క్రైస్తవ సోదరులతో పోస్ట్ కార్డ్, మెసేజ్ పోస్టింగ్ ఉద్యమాన్ని చేపట్టినా ఫలితం దక్కలేదని చెప్పారు. గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
పోలీసులను ఇంటి వద్దకు పంపి తనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం దారుణమని కోటంరెడ్డి అన్నారు. మనం నియంతల పాలనలో ఉన్నామా? లేక ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే విషయం అర్థం కావడం లేదని చెప్పారు. కేసులు, అరెస్టులు, తుపాకులు, తూటాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని... భవిష్యత్తులో గెరిల్లా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ప్రజా ఉద్యమాలను అడ్డుకునే ప్రభుత్వాలకు మంచి పేరు రాదని చెప్పారు. వైసీపీ పార్టీ వారు అడ్డగోలుగా రోడ్లపై మీటింగులు పెడితే రాని ఇబ్బందులు ప్రతిపక్షాలు శాంతియుతంగా కార్యక్రమాలు చేపడితే వస్తాయా? అని ప్రశ్నించారు. అణచివేతలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా ఇదే మాదిరి అణచివేత ధోరణిని ప్రదర్శించి ఉంటే... వైసీపీ నేతలు ఉద్యమాలు చేయగలిగేవారా? అని ప్రశ్నించారు.