రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ రాంప్రసాద్ కోరారు. శృ౦గవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలం వావిలిపాడు, కడకొండ గ్రామంలో గురువారం వేపాడ మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ప్రకటించిన మినీ మేనిఫెస్టో మహిళలకు పెద్దపీట వేసినట్లు అయిందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేసి, మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తారని ఆయన అన్నారు. వైసిపి ప్రభుత్వం గత నాలుగేళ్లలో అరాచకం, తప్పా రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి, రానున్న 24 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరుగులు తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.