వైయస్ఆర్ రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయంతో పాటు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్ల వ్యవధిలో సీఎం జగన్ ప్రభుత్వం రైతన్నలకు వివిధ పథకాల ద్వారా రూ.1,61,236.72 కోట్ల మేర నేరుగా సాయాన్ని అందించడం గమనార్హం.