ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టి ఏడాది నిండడానికి రెండు నెలల ముందు కొవిడ్–19 మహమ్మారి దేశాన్ని చుట్టుముట్టింది. దాన్ని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా 2020 మార్చి 24 నుంచి తొలి దశ లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటికి పది మాసాలుగా సామాన్య ప్రజానీకానికి అవసరమైన కొత్త పథకాలతో ముందుకు పరుగులు తీస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎదురైన మొదటి అడ్డంకి ఇది అని వైసీపీ నాయకులూ వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అయితే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను పీడిస్తున్న కరోనావైరస్ అత్యధిక ప్రజానీకానికి సోకకుండా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. అప్పటికే పేదలు, దిగువ మధ్య తరగతి జనం కోసం అమలులోకి వచ్చిన ఆర్థిక సహాయ పథకాలకు అదనంగా కొవిడ్ లాక్ డౌన్ కాలంలో పేదలకు ఉచిత రేషన్ వంటి తక్షణ తోడ్పాటు కార్యక్రమాలను వైఎస్సార్సీ సర్కారు ప్రవేశపెట్టింది. కొవిడ్–19 సృష్టించిన అననుకూల పరిస్థితులు ఏపీలో సామాజిక, ఆర్థిక సంక్షోభాలకు దారితీయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర జాగరూకతతో, చలనశీలతతో ప్రజలను ఆదుకోవడంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా ముందు నిలబడింది. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించి ఆంధ్రప్రదేశ్ సర్కారును ప్రశంసించింది. లాక్ డౌన్ వల్ల సాధారణ ప్రజాజీవితం స్తంభించింది. మామూలు ఉత్పత్తి, సేవలు వంటి ఉత్పాదక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయం కోల్పోయిన పేదలకు వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు అండగా నిలిచింది. మధ్య దళారులు లేని నగదు బదిలీ కార్యక్రమాలతో బలహీనవర్గాల ప్రజల కొనుగోలు శక్తిని క్షీణించిపోకుండా నిలబెట్టింది. ఇలా కరోనావైరస్ సృష్టించిన బీభత్స వాతావరణంలో ప్రజలకు ఆసరాగా ప్రభుత్వం నిలుస్తూ ఏడాది కాలం అలాగే ముందుకుసాగింది. కరోనావైరస్ ఇక నెమ్మదించించి, కొంత వరకు ఆంధ్ర ప్రజలు, ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవచ్చనుకునే సమయానికి రాష్ట్రంలోని అనేక జిల్లాలను భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు అల్లకల్లోలంలోకి విసిరేశాయి అని తెలియజేసారు.