భర్త మరణాన్ని తట్టుకోలేక.. 24 గంటలైనా గడవకముందే కట్టుకున్నవాడిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. అనారోగ్య కారణంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకే రోజున మృతి చెందటం గ్రామస్థులను కలిచివేసింది. నరుకూరు గ్రామానికి చెందిన రమణ (40), సుమలత (36) భార్యాభర్తలు. కొద్ది రోజుల నుంచి ఇద్దరూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రమణ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో వారం రోజుల క్రితం చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చెన్నైకి తరలించారు. ఆ తర్వాత మళ్లీ మంగళవారం ఉదయం చెన్నై నుంచి నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
భర్త చికిత్స పొందుతున్న సమయంలో భార్య సుమలత కూడా అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో రమణ బుధవారం ఉదయం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భర్త అంత్యక్రియలు పూర్తయిన కొన్ని గంటల వ్యవధిలోనే సుమలత చెన్నైలోని ఆస్పత్రిలో మృతి చెందారు. గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.