పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం సీటు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా కార్యకర్తలు, ప్రజలతోనే ఉంటానన్నారు. అభివృద్ధి ప్రాధాన్యమిస్తానన్నారు. సత్తెనపల్లిలో ఎలాంటి గ్రూపులూ లేవని కన్నా తేల్చి చెప్పారు. కోడెల కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. జిల్లాలో వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ వైరం లేదని.. అందరం కలిసి ముందుకు సాగుతామని కన్నా తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సత్తెనపల్లికి ఇంతకు ముందు డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణం తర్వాత అక్కడ ఎవరినీ ఇన్‌ఛార్జిగా నియమించలేదు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కోడెల శివ ప్రసాదరావు తనయుడు శివరాం బుధవారం సత్తెనపల్లిలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. కన్నా నియామకాన్ని నిరసించారు. కోడెల పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకొని కుటుంబ వారసుడిగా సత్తెనపల్లిలో తనకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.