కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అవినీతి, మాఫియా సామ్రాట్ అని బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జీ భరత్‌కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై గురువారం కావలిలో బీజేపీ నాయకులు చార్జీషీట్ ర్యాలీ నిర్వహించారు. ఐదు లాంతర్ల సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీవో కార్యాలయానికి చేరుకోగా, కార్యాలయంలో నేతలు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భరత్‌కుమార్ మాట్లాడుతూ వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఎమ్మెల్యే అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారని దుయ్యబట్టారు. ప్రశ్నించినవారిపై ఎదురుదాడి చేయడం, తప్పుడు కేసులు పెట్టి బెదిరించడం ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. ఎమ్మెల్యే అవినీతి నిగ్గుతేలే వరకు పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడలేదని కళుగోళమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రమాణం చేస్తారా ? అని భరత్ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు కమల, వీవీ రంగారెడ్డి, కంచర్ల మురళీనాయుడు, కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, పరుసు వెంకటేశ్వర్లు, బెల్లంకొండ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.