చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలం కువ్వాకొల్లి పంచాయతీ ఎల్లకట్టవలో బుధవారం జరిగిన బాణసంచా పేలుళ్లలో ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గ్రామంలో ఏ గడపలో చూసినా విషాదం అలుముకుంది. గురువారం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, కలెక్టర్ వెంకటరమణారెడ్డి గ్రామంలో పర్యటించారు. మృతుల కుటుంబీకులను పరామర్శించి, నష్టపరిహారం అందజేశారు. ప్రమాదంలో మరణించిన తీగుంట ఏడుకొండలు భార్య శిరీషకు రూ.5లక్షలు, నాగేంద్రబాబు తల్లికి రూ.5లక్షలు, శంకరయ్య భార్య పోలమ్మకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని అందజేశారు. ఈ కుటుంబాల్లోని పిల్లల చదువుకు అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారులను పిలిపించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గోదాము నిర్వాహకుడు వీరయ్య ఇంట్లో రూ.20లక్షలు విలువ చేసే నల్లమందు, బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకుని, గోదామును సీజ్ చేశారు.