విశాఖపట్టణం కెజిహెచ్ కు వచ్చే రోగులను ప్రైవేట్ క్లినిక్స్ కి తరలిస్తే అందుకు భాద్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని క్లినిక్కుల గుర్తింపును రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున హెచ్చరించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ముందుగా హెచ్ఒడీలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కమిటీ సమావేశంలో 15 పనులకు గాను సుమరు 1 కోటి 10 లక్షలు, వైద్య పరికరాలు నిమిత్తం ఒక కోటి ఆమోదించారు. హాస్పిటల్ కి అధాయం పెంచుటకు గాను అవసరమైన వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగుల అవసరాలను తీర్చే కేజీహెచ్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించేందుకు వైద్యులు కృషి చేయాలని, సత్వర సేవలందించాలని సూచించారు. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కెజిహెచ్ కు వచ్చే రోగులు చాల నిరుపేదలని అత్యవసర సమయాలలో సాధ్యమైనంతగా మంచి వైద్యం అందించి వారికి సహాయం చేయాలని అన్నారు.
సమావేశం అనంతరం నర్సింగ్ సిబ్బంది తమకు కల్పించిన సౌకర్యాల పట్ల సంతృప్తి చెంది కలెక్టర్ కు సన్మానం చేసారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. రాధాకృష్ణ, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిబాబు, డీఎం అండ్ హెచ్వో డా. జగదీశ్వరరావు , ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ బి. ఎ. నాయుడు, కమిటీ సభ్యులు వైద్యాధికారులు, ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.