తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం చక్రస్నానంతో ముగిశాయి. ఉదయం 6గంటలకు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, చక్రత్తాళ్వార్ ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అక్కడ స్నపన తిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ పరిపాలనా భవనం ఎదుట గల పిఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామి పిఆర్ తోట నుండి ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుండి 8. 30 గంటల వరకు స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.