కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై యువగళం పాదయాత్రలో కోడిగుడ్లుతో దాడిని చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఖండించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన దాడిని ఖండిస్తూ శనివారం ప్రకటన విడుదల చేశారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాదయాత్రలో కోడిగుడ్లుతో లోకేష్ పై దాడికి ప్రయత్నించారు. అయితే ఆ గుడ్డు లోకేష్ కు తగలకుండా పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తగిలాయి. దీంతో సెక్యూరిటీ అప్రమత్తం అయింది.
ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో బహిరంగ సభ ముగించుకుని ఆర్టీసి బస్టాండ్ దాటిన తరువాత ఓ దుకాణం వద్ద ఆగి ప్రజలతో మాట్లాడుతుండగా గుడ్ల దాడి జరిగింది. ఈ గుడ్లు సెక్యూరిటిపై పడటంతో వారు అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరులో లోకేష్ యువగళం సందర్భంగా పోలీసు సెక్యూరిటీ ఉన్నప్పటికీ దాడి జరగడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు మంచి పద్దతి కాదని హితవు పలికారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు.