ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 చనిపోయిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ దుర్ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు కోరిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. పట్టాలపై ఉండే హెడ్ వైరింగ్ పునరుద్దరించేందుకు రైల్వే శాఖ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. బాలాసోర్, కటక్, భువనేశ్వర్‌లలో చికిత్స పొందుతున్న వారికి ఒడిశా ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందాలు ఎల్లవేలలా పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రైల్వేలో రిస్క్ అండ్ సేఫ్టీ నిబంధనలను విశ్లేషించి వాటిపై సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ యివారీ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణులను సభ్యులుగా చేయాలని కోరారు. ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోర్టును కోరారు. ఈ కమిటీ అధ్యయనం చేసి ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందించేలా చూడాలని విన్నవించారు.