ఒడిశా రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తామని బిలియనీర్, వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. దీంతో గౌతమ్ అదానీ మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఒడిశాలో జరిగిన ఈ అత్యంత ఘోర రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. లోకం తెలియని పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారడం చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వారికి మంచి విద్యను అందించి భవిష్యత్ కల్పించాలనే ఉద్దేశంతోనే వారికి ఉచిత విద్యను అందించాలనుకుంటున్నట్లు వివరించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడం.. వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
‘‘ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో అందరం తీవ్ర కలత చెందాం. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పాఠశాల విద్యను అందించాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది. బాధితులను ఆదుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. వారి కుటుంబాలు మరియు పిల్లలకు మంచి భవిష్యత్‌ను అందించండి’’ అంటూ గౌతమ్ అదానీ హిందీలో ట్వీట్ చేశారు.