ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జనసేన పార్టీ దూకుడు పెంచుతోంది. ఇదిలావుంటే జనసేనాని పవన్ కల్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర సాగించనున్నారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వారాహి యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేపు సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్న నేపథ్యంలో నాదెండ్ల మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.17,144 కోట్ల నిధులు ఇస్తున్నట్టు కేంద్రం తెలిపిందని నాదెండ్ల వెల్లడించారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు కుదించినట్టు కేంద్రం తెలిపిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. పోలవరంలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో ప్రజలకు వివరించాలని నిలదీశారు. పోలవరంపై సీఎం జగన్ మీడియా సమక్షంలో సమీక్ష చేపట్టాలని పేర్కొన్నారు.