విజయవాడలో వీధి కుక్కల దాడితో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. 5 సంవత్సరాల చిన్నారిపై మూడు కుక్కలు మంగళవారం దాడి చేశాయి. వైసిపి కార్పొరేటర్ ఇంటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ వన్ టౌన్, వాగు సెంటర్ ప్రాంతంలో 48వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ ఇంటి సమీపంలోనే మేఘన అనే 5 సంవత్సరాల చిన్నారిపై మూడు వీధి కుక్కలు మంగళవారం ఉదయం దాడి చేశాయి. ఇంటి ముందున్న ఐదేళ్ల బాలికపై మూడు వీధి కుక్కలు ఒకేసారి ఎగబడ్డాయి. నలువైపుల నుంచి దాడి చేసి బాలికను తీవ్రంగా గాయపరిచాయి. బాలిక ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చి రాళ్లు విసిరి కుక్కలను తరిమికొట్టారు.
బాలికను స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తము ఆస్పత్రికి తీసుకువెళ్లారు. గత కొన్ని నెలలుగా వీధి కుక్కలు దాడులు ఎక్కువవుతున్న తరుణంలో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం కాకపోవడం వల్లే ఇటువంటి దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీధి కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. హైదరాబాదులో వీధి కుక్కల దాడిలో ఒక చిన్నారి తన ప్రాణాలను కోల్పోయిన సంఘటన జరిగిన విజయవాడలో అధికారులు అప్రమత్తం కావడం లేదు. ప్రజల ప్రాణాలు పోతే గాని కార్పొరేషన్ అధికారులు స్పందించరేమో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుంచి తమ ప్రాణాలను కాపాడాలంటూ వేడుకుంటున్నారు.