అనకాపల్లికి చెందిన అప్పలనాయుడు గంజాయి విక్రయాలకు కేంద్రంగా మారినట్టు పోలీసులు గుర్తించారు. అతని వద్ద చెన్నైకి చెందిన ఆనందవేలు భారీ ఎత్తున గంజాయిని కొని విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్టు నిందితులు తెలిపారు. శ్రీలంకకు చెందిన ఖాదర్‌భాయ్ చెన్నైలో ఈ గంజాయిని వీరి నుంచి కొనుగోలుచేసి చిన్నచిన్న పడవల ద్వారా శ్రీలంకకు తరలిస్తున్నట్టు ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. గంజాయికి బదులుగా నగదు కాకుండా బంగారాన్ని స్మగ్లింగ్ ముఠా తీసుకుంటున్నట్టు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.48 లక్షలు ఉంటుందన్నారు. పట్టుబడిన వారిలో అనందవేలు ముఠాకు చెందిన ఐదుగురు, అప్పలనాయుడు ముఠాకు చెందిన ముగ్గురు ఉన్నారని చెప్పారు. ఇద్దరు ప్రధాన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. వీరిలో ఖాదర్‌భాయ్ శ్రీలంకకు చెందిన వ్యక్తి కావడంతో రెడ్‌కార్నర్ నోటీస్, లుక్ అవుట్ నోటీసులను జారీ చేసి అరెస్టు చేస్తామని తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్టు చెప్పారు.