ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లుడిపై మాట తూలిన మామ,,,ఎవరూ తగ్గకపోవడంతో విడాకులు తీసుకునే దాకా వ్యవహారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 06, 2023, 06:14 PM

గతంలో  పాత తరం వాళ్లు వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. భాగస్వామి, అత్తింటి వారు ఎంత ఇబ్బంది పెట్టినా.. ఇంటి గుట్టు బయటికి రాకుండా.. ఓపికతో వ్యవహరిస్తూ.. సర్దుకుపోవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ నేటి తరంలో సహనం తగ్గిపోయింది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ.. నువ్వెంత అంటే నువ్వెంత అనేంత వరకు పోతున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించుకోగలిగే సమస్యలను కూడా బూతద్ధంలో చూసి.. విడిపోయే దాకా తెచ్చుకుంటున్నారు. భార్యాభర్తలు ఆవేశంలో గొడవపడితే సర్ది చెప్పాల్సిన పెద్దలు సైతం వారి మధ్య గొడవలకు, విడాకులకు కారణం అవుతున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా ఇటీవల వెలుగు చూసింది.


విశాఖపట్నానికి చెందిన రాజుకి, రాజమండ్రికి చెందిన లతతో ఇటీవలే పెళ్లయ్యింది (ఊర్ల పేర్లు, భార్యాభర్తల పేర్లు మార్చాం). అబ్బాయి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు లక్ష రూపాయల వరకు జీతం వస్తోంది. దీంతో భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు. కొన్నాళ్లపాటు కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ అబ్బాయి తండ్రికి రూ.5-6 లక్షల వరకు అప్పు ఉందని.. దాన్ని తీర్చాల్సిన బాధ్యత కొడుకుపైనే ఉందని కొన్నాళ్ల తర్వాత అమ్మాయి కుటుంబానికి తెలిసింది.


అప్పులు చేసిన అబ్బాయి తండ్రికి ఆస్తాపాస్తులు లేవా? అంటే ఉన్నాయి. అబ్బాయికున్న ఉద్యోగంతోపాటు తండ్రి సంపాదించిన ఆస్తులను కూడా చూసిన తర్వాతే ఈ పెళ్లి చేశారు (ఈ మధ్య చాలా పెళ్లిళ్లు జరుగుతోంది ఇలాగే కదా). తండ్రి చేసిన అప్పును కొడుకు తీర్చడం అమ్మాయి తరఫు వాళ్లకు ఇష్టం లేదు. ఓ రోజు ఇంట్లో వాళ్ల ఇంట్లో చికెన్ వండారు. ఈ విషయం తెలుకున్న అమ్మాయి తండ్రి.. ‘అంత అప్పు పెట్టుకొని నీ బతుక్కి చికెన్ తక్కువైందా..?’ అంటూ అల్లుడి విషయంలో మాట తూలాడు. దీంతో గొడవ జరిగింది. అది కాస్తా పెద్దదయ్యింది.


తన తండ్రి ఏం చేసినా తన మేలు కోరే చేస్తాడనే భావనతో ఉన్న అమ్మాయి కూడా ఈ విషయంలో తండ్రిని వారించకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. అటు అల్లుడు.. ఇటు మామ ఎవరూ తగ్గకపోవడంతో.. ఆ గొడవ కాస్తా విడాకుల దాకా వెళ్లింది. కోట్లలో కట్నం ఇచ్చి.. అటువైపు బాగానే ఆస్తులున్నా.. అల్లుడి సంపాదన బాగానే ఉన్నా.. అతడి తండ్రి చేసిన రూ.5-6 లక్షల అప్పు విషయంలో అమ్మాయి తండ్రి జోక్యం చేసుకోవడం.. అల్లుడి విషయంలో మాట తూలడం.. దాన్ని అల్లుడు అవమానంగా ఫీలవడం.. మామ పెద్ద మనసుతో తప్పును ఒప్పుకోకపోవడం.. ఇంతటి అనర్ధానికి కారణమైంది. ఈ విషయంలో అబ్బాయి కుటుంబం వైపు నుంచి కూడా ఏ తప్పూ లేదనడానికి లేదు. అంతటి ఆస్తులు ఉన్నప్పుడు కొంత ఆస్తిని అమ్మి ఆస్తిని అప్పు తీర్చితే బాగుండేది. ఒకవేళ ఆస్తిని అమ్మలేకపోతే.. ఎందుకు వద్దనుకుంటున్నామో కోడలికి అర్థమయ్యేలా చెప్పి ఉండాలి. అలా చేయకపోవడంతోపాటు.. అమ్మాయి నగలను తమ దగ్గర ఉంచుకోవడం.. ఏదైనా శుభకార్యం ఉంటేనే ఆమెకు ఇవ్వడం కూడా మనస్పర్థలకు దారితీసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com