జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించి.. బీజేపీలో చేరినట్లు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ఇటీవలే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఇక ప్రజా జీవితంలో ఉండాలా? వద్దా? అని ఇన్ని రోజులు ఆలోచించానని ఉమ్మడి ఆయన పేర్కొన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకు రూ.7,400 కోట్లతో మంచి నీటి పథకం ప్రణాళిక చేశానని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, ఒక్క జిల్లా నీటి కోసమే అంత డబ్బు ఎలా ఖర్చు చేస్తారని ప్రస్తుత తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆనాడు తనతో గొడవపడ్డారని పేర్కొన్నారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు తాను ప్రారంభించిన మంచి నీటి పథకాన్ని పక్కనపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇలా పనులు ఆపడం సరికాదని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలు సొంత ఖజానా నింపుకుంటాయి తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోవన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
పాలకుడు తనకు తోచినట్లు చేయకూడదని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రజాహితాన్ని కాంక్షించి మాత్రమే పాలకుడు పని చేయాలని చెప్పారు. అయితే, గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. అధికారాన్ని సేవా మార్గంగా ఉపయోగించుకునే పార్టీ బీజేపీ అని.. అంత్యోదయం, సభ్ కా వికాస్ అనేది బీజేపీ మూల సిద్ధాంతమన్నారు. గతంలో రోజుకో స్కామ్ గురించి పత్రికల్లో చదివేవాళ్లమని.. ఇప్పుడు రోజుకో స్కీమ్ గురించి చదువుతున్నామని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.