ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి.... జగన్ కు సర్కార్ కు అమిత్ షా ప్రశ్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 11, 2023, 10:32 PM

కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి అంటూ  జగన్ సర్కార్ ను  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. జగన్‌ నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని ఆయన ఆరోపించారు. విశాఖలోని రైల్వేస్ గ్రౌండ్‌లో జరిగిన సభలో మాట్లాడిన అమిత్ షా.. అల్లూరి, తెన్నేటి విశ్వనాథాన్ని స్మరిస్తూ ప్రసంగం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం, యూపీఏ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు.


కేంద్రం నిధులు ఇస్తుంటే.. జగన్ తన ఫొటో పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రేషన్ బియ్యం మోదీ ఇస్తుంటే.. జగన్ తన ఫొటో వేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెప్పుకుంటున్నారు కానీ.. రైతుల ఆత్మహత్యల విషయంలో జగన్ సిగ్గుపడాలన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో.. ఏపీ మూడో స్థానంలో ఉందన్న అమిత్ షా.. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం విద్రోహ శక్తుల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఈ 9 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కోసం మోదీ భారీగా నిధులు ఇచ్చారని వివరించారు.


'మన్మోహన్ సింగ్ హయాంలో అవినీతి జరిగినా.. చర్యలు తీసుకునే సత్తా లేకపోయింది. కానీ.. బీజేపీ పాలనలో.. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నాం. సర్జికల్ స్ట్రైక్‌తో పాక్‌కు బుద్ధిచెప్పాం. పదేళ్ల యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మోదీనే గెలిపించాలి. 300 పైకి ఎంపీ స్థానాల్లో మళ్లీ విజయం సాధిస్తాం' అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.


శనివారం నిర్వహించిన సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. 'ప్రధాని వచ్చి రాజధానికి శంకుస్థాపన చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. దేశంలో మోదీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మార్చారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను జవాబుదారీ రాజకీయాలుగా, ఫలితాలు చూపే పారదర్శక రాజకీయాలుగా మార్చిన ఘనత మోదీదే. 9 ఏళ్లుగా ఈ దేశానికి మోదీ సుపరిపాలన అందించారు' అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు భేటీ తర్వాత.. టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలు బయల్దేరాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ఏపీ వచ్చి జగన్‌పై విమర్శలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com