ప్రైవేటు డెంటల్ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న మహిళ మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా ఇద్దరు ఆగంతకులు యాసిడ్ పోశారు. ఆమె తీవ్ర గాయాలకు గురై కంటిచూపు కోల్పోయింది. ఏలూరులోని విద్యానగర్ మానిస్ట్రీ దగ్గరలో నివాసం ఉంటున్న యడ్ల ప్రాంచిక (35) భర్త ఆంజనేయులుతో ఏడాది క్రితం గొడవ కారణంగా వేరుగా ఉంటోంది. ఆంజనేయులు రాజమండ్రిలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ప్రాంచిక తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో తన పుట్టింటివారితోనే ఉంటుంది. రెండు నెలల క్రితం విద్యానగర్‌లో ఒక డెంటల్ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా చేరింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీ దిగి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటి సమీపంలోని మానిస్ట్రీ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఆగి అకస్మాత్తుగా ప్రాంచికాపై యాసిడ్ పోశారు. ఆమె కేకలు వేస్తూ సమీపంలోని ఇంటి వద్దకు వెళ్ళిపోయింది. ఆమె చెల్లి యడ్ల సౌజన్య, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెపై నీళ్లు పోసి కాలిపోయిన దుస్తులను మార్చి మరో స్కూటర్‌పై ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె రెండు కళ్లు చూపు కోల్పోయినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో బాధితురాలిని డీఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనం తరం వారు మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నింది తులను పట్టుకుంటామన్నారు. డీఎస్పీ, నగరంలోని సీఐలు, ఎస్‌ఐలు ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. అనంతరం బాధితురాలి ఇంటి సమీపంలోని సంఘటనా స్థలిని పరిశీలించారు. ఫ్రాంచిక కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.