ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. నియోజకవర్గస్థాయిలో విద్యార్థులను గురువారం సత్కరించేందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్మెంట్లలో విద్యాసంస్థలున్నాయి. ఒక్కో మేనేజ్మెంట్ పరిధిలోని సంస్థల్లో పదోతరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానిస్తారు. ఇలా నియోజకవర్గస్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులు 678 మంది ఉన్నారు.