రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగృహంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు, వైఎస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదిర ప్రభాకర్, దళిత్ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కాలే వెంకటరమణరావు, వైయస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లేళ్లపూడి లాజర్ తదితరులు మంత్రితో కేక్ కట్ చేయించి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మంత్రి మేరుగు నాగార్జున దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలో ఎస్సీల సంక్షేమం అద్భుతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎస్సీలకు మేలు జరగడం లేదంటూ టీడీపీ నేతలు విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో గతంలో పరిపాలించిన ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా అన్ని రాష్ట్రాలు కలిపి ఎస్సీలకు చేస్తున్న సాయం కంటే ఒక్క ఏపీ సాయమే అత్యధికమని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో చేసిన ఖర్చు రూ.33,625 కోట్లు కాగా, మూడున్నరేళ్ల కాలంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.49,710.17 కోట్లని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎస్సీల సంక్షేమానికి రూ.33,629 కోట్లు ఖర్చుచేస్తే, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ఎస్సీల కోసం రూ.58,353 కోట్లు ఖర్చుచేశారని వివరించారు.