వై.ఎస్.ఆర్. కంటివెలుగు కార్యక్రమంలో రోజువారీ కంటిపరీక్షలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ నేత్రవైద్య సహాయకులను ఆదేశించారు. కంటి పరీక్షలు చేయడంలో గ్రామ, వార్డు వలంటీర్లు సహకరించేలా ఆదేశాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కంటిపరీక్షలు పూర్తయిన వారికి కళ్లద్దాల పంపిణీని త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. శుక్రవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంటివెలుగు కార్యక్రమంపై సమీక్షించారు. జిల్లాలో కంటివెలుగులో గుర్తించిన 5 వేల మందికి శస్త్రచికిత్సలు పూర్తిచేయాల్సి వుందని, వారందరికీ నిర్దిష్ట వ్యవధిలో చికిత్సలు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రైవేటు ఆసుపత్రులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించి తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు పూర్తిచేయాలని ఆయా శిబిరాలకు అర్హులైన వారిని రప్పించడంలో గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా తగిన సహకారం అందించేలా చర్యలు చేపడతామన్నారు. కళ్లద్దాల పంపిణీలో వైద్యాధికారుల సహకారం అందించేలా చర్యలు చేపడతామని కలెక్టర్ చెప్పారు. కంటి చికిత్సలు చేయించుకొనే వారికి రవాణా సౌకర్యాలు కల్పించినట్లయితే మరింత ఎక్కువ మందికి చేయడం సాధ్యమవుతుందని పుష్పగిరి, శంకర్ ఫౌండేషన్ తదితర ఆసుపత్రుల ప్రతినిధులు వివరించారు.