అటు భార్యకు నచ్చజెప్పలేక, ఇటు తల్లి మాట వినలేక మధ్యలో ఇళ్లలో మగవాళ్లు నలిగిపోతుంటారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఓ వ్యక్తి భార్య వైపే మొగ్గు చూపాడు. అందుకోసం.. కనీ పెంచిన కన్నతల్లినే చంపేసి అడ్డుతొలగించుకున్నాడు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటన బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరులో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకూరు గ్రామానికి చెందిన కె. శ్రీనివాసరావు ఇంట్లో కొంత కాలంగా అత్తాకోడళ్ల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. శ్రీనివాసరావు ఇటీవల గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. రెండు రోజుల కిందట గృహ ప్రవేశం కూడా చేశారు. అయితే, అత్తగారు ఇంట్లో అడుగుపెడితే తాను ఆ ఇంట్లో ఉండనని శ్రీనివాసరావు భార్య తెగేసి చెప్పింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో శ్రీనివాసరావు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తల్లి సుబ్బులమ్మ (85) అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
బుధవారం (జూన్ 21) సాయంత్రం పొద్దుపోయాక శ్రీనివాసరావు తన తల్లి సుబ్బులమ్మకు మాయమాటలు చెప్పి బైక్‌పై కూర్చోబెట్టుకున్నాడు. నేరుగా గ్రామ శివార్లలో ఉన్న చిన్నమ్మకుంట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వృద్ధురాలైన తన తల్లిని అమాంతం నీళ్లలోకి నెట్టేశాడు. పేగు బంధాన్ని ఒక్కసారిగా తెంచుకొని ఏమీ ఎరుగనట్టు ఇంటికి తిరిగొచ్చి పడుకున్నాడు.
మరుసటి రోజు వేకువజామున కొంత మంది పశువుల కాపర్లు కుంటలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం సుబ్బులమ్మదిగా గుర్తించారు. ఆమె కుమారుడు శ్రీనివాసరావుపై అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.