ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముద్రగడ ఓ లెజెండ్,,,,పోసాని కృష్ణమురళి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 23, 2023, 09:17 PM

ముద్రగడ ఓ లెజెండ్ అని వైసీపీ నేత, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కొనియాడారు. ఇదే క్రమంలో  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల పవన్ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై చేసిన వ్యాఖ్యలను పోసాని ఖండించారు. ముద్రగడ ఓ లెజెండ్ అని కొనియాడారు. కాపుల కోసం, కాపు ఉద్యమం కోసం, కాపు జాతి కోసం, కాపు రిజర్వేషన్ల కోసం డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు... చివరికి మంత్రి పదవిని కూడా పక్కకి తన్నేశాడు అని పోసాని వివరించారు. 


"పవన్ కల్యాణ్ గారూ మీకు తెలియకపోవచ్చేమో... ఇది 80వ దశకం నాటి సంగతి. నాడు ఎన్టీఆర్ హయాంలో ముద్రగడ పద్మనాభం మంత్రిగా పనిచేశారు. అయితే తన శాఖలో ఎన్టీఆర్ జోక్యం చేసుకోవడంతో వద్దని ఆయనను వారించాడు. కానీ ఎన్టీఆర్ వినకుండా ముద్రగడకు కేటాయించిన శాఖలో జోక్యం చేసుకున్నాడు. దాంతో ముద్రగడ ఏంచేశాడో తెలుసా...? రాజీనామా లేఖ రాసి ఎన్టీఆర్ ముఖాన కొట్టాడు. రైలెక్కి నేరుగా కిర్లంపూడి వచ్చేశాడు. అదే... నువ్వు ప్రేమించే చంద్రబాబు ఏంచేశాడో తెలుసా పవన్ కల్యాణ్...? వేరే పార్టీ నుంచి వచ్చి రామారావు కాళ్లు పట్టుకుని, లక్ష్మీ పార్వతి కాళ్లు పట్టుకుని వేచి చూసి.. వేచి చూసి ఎన్టీఆర్ ను ఒక్క గుద్దు గుద్ది, వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడు. 


కాపు సోదరులారా.. ఈ రెండు విన్నారు కదా. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గొప్పవాడా... పవన్ కల్యాణ్ ప్రేమించే చంద్రబాబు గొప్పవాడా? కాపు కుర్రాళ్లు, మహిళలు పవన్ సినిమా ఆర్టిస్ట్ అని చూడ్డానికే వస్తారు. కానీ పవన్ వాళ్ల మధ్యలో నిలబడి కాపులనే తిడతాడు. కాపులను కాపులే తిట్టుకుంటే ఎప్పుడు కాపు రిజర్వేషన్ రావాలి, ఎప్పుడు కాపు నేత ముఖ్యమంత్రి కావాలి?" అని వ్యాఖ్యానించారు. 


ముద్రగడ 1981 నుంచి కాపుల కోసం పోరాడుతున్నారు... ఆయన తన ఉద్యమంలో ఒక్క రూపాయి తిన్నాడని నువ్వు నిరూపించు... నేను రాజకీయాల నుంచి వెళ్లిపోతానని పవన్ కు పోసాని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించులేకపోతే నువ్వు ఎక్కడికీ వెళ్లనవసరంలేదు... నేరుగా ముద్రగడ వద్దకు వెళ్లి, నిజం తెలుసుకున్నాను అని చెప్పి క్షమాపణలు అడుగు... అప్పుడు నువ్వు నిజంగానే చాలా గొప్పవాడివి అవుతావు అని స్పష్టం చేశారు. 


"పవన్ కల్యాణ్... నువ్వు చంద్రబాబును సీఎం చేయాలనుకోవడంలో తప్పులేదు. చంద్రబాబు ఏంచేశాడో తెలుసా... నాడు ఎన్టీఆర్ వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కొనేసి వెన్నుపోటు పొడిచాడు... ఆయన చావుకు కారణమయ్యాడు... ముఖ్యమంత్రి అయ్యాడు. 


ఇదే చంద్రబాబునాయుడు కొన్నాళ్ల కిందట జగన్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనేసి వాళ్లలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు కేసీఆర్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు... పారిపోయివచ్చేశాడు. అయినా ఫర్వాలేదు చంద్రబాబే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అంటావా?


ఇదే చంద్రబాబు నాడు వంగవీటి రంగాను చంపించాడు... ఈ విషయం అందరికీ తెలుసు. అయినాగానీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేస్తావా? నాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీ అన్నయ్య చిరంజీవిని ముసలోడు రామోజీరావు పిలిచి... మీరు చంద్రబాబుతో కలవండి, రాజశేఖర్ రెడ్డిని ఓడించేందుకు సహకరించండి, ఈసారికి చంద్రబాబును సీఎం కానివ్వండి, తర్వాత మీరు ప్రయత్నించవచ్చు అని చెప్పాడు. కానీ చిరంజీవి అందుకు ఒప్పుకోలేదు. 


వద్దండీ... నేను పార్టీ పెట్టింది ప్రజల కోసం. ఓడిపోయినా ఫర్వాలేదు... హుందాగా ఒప్పుకుంటాం. ఇలా కలవడం మాత్రం కుదరదు. వైఎస్సార్ ను ఓడించేందుకు నేను పార్టీ పెట్టలేదండీ... నేను గెలవడానికి పార్టీ పెట్టా అని చెప్పేశారు. హ్యాట్సాఫ్ చిరంజీవి. అక్కడ్నించి చంద్రబాబు ఎంత ఘోరంగా తిట్టించాడో తెలుసా... మీ అన్నయ్య ఇంట్లోని ఆడవాళ్లను కూడా అవమానించేలా తిట్టించాడు. అంతేకాదు కాపులు గెలిస్తే కమ్మవాళ్లను బతకనివ్వరని ప్రచారం చేశారు. మీ అన్నయ్యను అవమానించినా ఫర్వాలేదా, కాపులను రౌడీలన్నా ఫర్వాలేదా! ఏదేమైనా సరే చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి కావాలని కాపుల మధ్యలో నిల్చుని మాట్లాడుతున్నావా? నిన్ను నువ్వే ప్రశ్నించుకో పవన్ కల్యాణ్" అని పోసాని కృష్ణమురళి వాడీవేడి వ్యాఖ్యలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com