కృష్ణా జిల్లా యువకుడికి.. తమిళనాడు యువకుడితో పరిచయం ఏర్పడింది. గోవాలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడే ఓ ఆలోచన తట్టింది.. వెంటనే ప్లాన్ అమలు చేశారు. కానీ డ్యామిట్ కథ అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం నక్కవానిదారికి చెందిన ముళ్లపూడి మహేష్ గతంలో ఓ కూల్‌డ్రింక్ కంపెనీకి డిస్టిబ్యూటర్‌గా బిజినెస్ చేశాడు. వ్యాపారంలో అతడికి నష్టాలు వచ్చాయి. తమిళనాడు మధురై కేకేనగర్‌కు చెందిన జ్ఞానదేశికన్ నిరంజన్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేశాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు.
ఈ ఇద్దరు 2021 డిసెంబర్‌లో గోవాలో కలిశారు.. అక్కడ పరిచయం ఏర్పడింది. ఇద్దరు తమ ఇబ్బందుల్ని ఒకరితో మరొకరు పంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు గంజాయి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఈ నెల 22న సాయంత్రం మహేష్, నిరంజన్‌లు కలిసి చెన్నై వైపు కారులో వెళ్తున్నారు. ఇంతలో ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో హైవేపై సింగరాయకొండ సీఐ డి.రంగనాథ్, టంగుటూరు ఎస్సై ఎస్.కె.ఖాదర్‌బాషా తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు.
ఈ క్రమంలో ఈ కారును ఆపి సోదాలు చేస్తే గంజాయి దొరికింది. నిందితులు కారు డోరులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి రూ.2.64 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు ధారకొండకు చెందిన చిట్టి అనే వ్యక్తి దగ్గర తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి మహేష్‌కు చెందిన కారులో చెన్నైకి చేర్చి అక్కడ ఆకాష్ అనే వ్యక్తికి విక్రయిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు తమిళనాడుకు చెందిన దొంగల్ని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని తిరువళ్లూరు వేల్లివోయాల్‌కు చెందిన దురై సూర్య.. ఎగ్మూర్‌లోని పుడుపేటకు చెందిన కుమార్ గోపాల్.. త్రివేలిగనికి చెందిన రవి అజిత్ మోజెస్ మధ్య పరిచయం ఏర్పడింది. వీరిలో సూర్య, రవి అజిత్ మోజెస్ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్ గోపాల్ ఏసీ మెకానిక్. ఈ గ్యాంగ్ తమిళనాడులో చోరీ చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. జువైనల్ హోంలో శిక్ష అనుభవించిన తర్వాత విడుదలయ్యారు.
తమిళనాడులో చోరీలు చేస్తే దొరికిపోతామని భావించి.. తమిళనాడుకు దగ్గరగా ఉన్న చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దొంగతనాలు చేస్తున్నారు. తమిళనాడులోని పీరక్కంకరనై ప్రాంతంలో బైక్ చోరీ చేసి ప్రకాశం జిల్లా శింగరాయకొండకు వచ్చారు. అక్కడ ఈ నెల 12న ఉపాధ్యాయుల ఇంటిలో చోరీ చేశారు. అంతకముందు ఒంగోలులో కూడా మరో దొంగతనం చేశారు. నెల్లూరు జిల్లాలో మూడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒక్కొక్క చోరీ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఈ చోరీ కేసుల్లో నిందితులపై ఫోకస్ పెట్టారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 434 గ్రాముల బంగారం, 5.2 కిలోల వెండి, బైక్ సీజ్ చేశారు.