మొన్నటి వరకు వేడితో మండిపోయిన ఏపీ రెండు రోజులుగా వాతావరణం చల్లబడింది. పశ్చిమ మధ్య, వాయువ్య మధ్య బంగాళాఖాతంలో.. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం రుతుపవనాల విస్తరణకు దోహదపడుతోంది అంటున్నారు. ఈ ప్రభావంతో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని చెబుతున్నారు. రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా బీఆర్ అంబేద్కర్ తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు మన్యం, అనకాపల్లి, అల్లూరి , ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, ధూళిపాళ్లలో 62, చాగల్లులో 59.5, ముప్పాళ్లలో 46 ఎంఎం వర్షం కురిసింది. రుతుపవనాల విస్తరణతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అనడంతో ఖరీఫ్ పనులు జోరందుకుంటాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రుతుపవనాల విస్తరణ కాస్త ఆలస్యం అయ్యింది. కేరళ మీదుగా ఈ నెల 11వ తేదీన శ్రీహరికోట వరకూ వచ్చిన రుతుపవనాలు.. వారం రోజులు విస్తరించలేదు. ఈ నెల 19న కావలి వరకు వచ్చి.. మళ్లీ మూడు రోజులు కదలిక లేకుండా పోయింది.
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో భారీ వర్షం కురిసింది. దీంతో వేమారెడ్డికూడలిలో హైవేపే వర్షపునీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పల్నాడు జిల్లా గురజాలలో కూడా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి , మాచవరం మండలాల్లో వాన కురిసింది. కొన్ని ప్రాంతాలలో రోడ్లపై నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గురజాల రోడ్లలో భారీ వర్షపు నీరు రోడ్లపై చేరుకోవడంతో జనాలు ఇబ్బందిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లపై వరద నీరు ప్రవహించింది.