గోదావరి జిల్లాల అభివృద్ధితో పాటు కాలుష్య నివారణకు మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పార్టీ కార్యకర్తలతో సోమవారం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విద్య, వైద్యం కొద్ది మంది చేతుల్లోనే ఉండకూడదని.. అధికారంలోకి రాగానే అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జనసేన పార్టీ మార్పు కోసం వచ్చిందని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటానని పునరుద్ఘాటించారు. మార్పు కోసం వచ్చిన మనం మధ్యలో వెనకడుగు వేయకూడదన్నారు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
2008 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని.. మార్పు కోసం పంతం పట్టి కొనసాగుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు చాలా అవసరమని.. ఈ మూడు కొద్ది మంది చేతుల్లోకి వెళ్లి, మిగతా వాళ్లు దేహి అనే పరిస్థితిలో ఉండకూడదన్న ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించానని తెలిపారు. ఎక్కడ చూసినా ఇసుక దోచేస్తున్నారని.. దీని వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆక్వా కాలుష్యం వల్ల ఆరోగ్యం అనేది పెద్ద సమస్యగా మారిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గోదావరి జిల్లాలో కేరళ తరహా టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ, పెట్టుబడి పెట్టేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటివాళ్లు వ్యాపారాలు చేస్తూ తమ స్వార్థం చూసుకుంటున్నారని విమర్శించారు. తాను పార్టీని నడుపుతూ దెబ్బలు తిన్నాను తప్ప, కార్యకర్తల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లకుండా చూడగలిగానని చెప్పారు. డబ్బులు ఖర్చు చేయకుండా అభిమానులు కార్యకర్తల ప్రేమాభిమానాన్ని జనసేన పార్టీ సొంతం చేసుకోగలుగుతుందని వెల్లడించారు.