వైఎస్సార్ లా నేస్తం పథకం నిధుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. లా నేస్త పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల అకౌంట్‌లలో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 5 నెలలకు గాను రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 అకౌంట్‌లలో జమ చేశారు.
నాలుగేళ్లగా లా నేస్తం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మొత్తం 2677 మందికి రూ.6.12 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. లా కోర్సు పూర్తిచేసిన, మొదటి మూడేళ్లలో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నామన్నారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.8లక్షలు ఇస్తున్నామని.. దీని వల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారన్నారు.
మంచి ఆలోచనతో ఈ పథకం ప్రారంభించామని.. ఇప్పటి వరకూ 5,781 మందికి మేలు జరిగిందన్నారు. మొత్తంగా 41.52కోట్లు జూనియర్ లాయర్లకు ఇచ్చామని.. ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. కేవలం ఏపీలో మాత్రమే జరుగుతుందని.. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేశామన్నారు. మెడిక్లెయిమ్, ఇతరత్రా అవసరాలకు రుణాలను ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేశామన్నారు.
న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందన్నారు. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తాను ప్రభుత్వం తరఫు నుంచి న్యాయవాదుల నుంచి ఆశిస్తున్నది ఇదొక్కటే అన్నారు. ఈ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దన్నారు.
అంతేకాదు లాయర్ల కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీ సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సాయం కోరే న్యాయవాదులు ఆన్‌లైన్‌లో sec_law@ap. gov.inద్వారా/నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి 1902 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.