ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్కడే అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని ఐఎండీ అంటోంది. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రుతుపవనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఆదివారం ఉరుములు, ఈదరుగాలులతో వర్షాలు కురిశాయి.
అల్పపీడనానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వరకు విస్తరించింది. ఈ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదు కానీ.. ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంటోంది. ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని.. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో ఈ నెల 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. నేడు మన్యం, అల్లూరి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఆదివారం తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల, పార్వతీపురం మన్యం, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తూర్పు గోదావరి జిల్లా పైడిమెట్టలో 5.9 సెంటీ మీటర్లు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస 4.1, గుంటూరు జిల్లా రావెలలో 4, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతపురంలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆ వర్షానికే నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. అంతేకాదు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. ఓ మోస్తరు నుంచి చిరుజల్లులు కురిశాయి.
మరోవైపు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో.. సకాలంలో వర్షాలు కురవక 20 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. నాలుగు జిల్లాల్లో సాధారణం, రెండు జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది అంటున్నారు. రాష్ట్రంలో అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో సాధారణం కంటే 68.1 శాతం లోటు వర్షపాతం.. అత్యధికంగా బాపట్ల జిల్లాలో సాధారణంకంటే 38.5 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అలాగే సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలో పల్నాడు, కృష్ణా, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాలు ఉన్నాయి. వారం క్రితం వరకు ఎండలు, వేడిగాలులతో ఇబ్బందిపడిన జనాలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో పాటూ ఇప్పుడు అల్పపీడనం ఏర్పడటంతో వర్షాలు ఊపందుకున్నాయి.