ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికిల్‌సెల్ వ్యాధి నుంచి గిరిజనులను ముక్తిచేసేందుకు ఏపీ సర్కార్ వినూత్న కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2023, 07:59 PM

గిరిజ‌నుల‌ను ద‌శాబ్దాలుగా ప‌ట్టి పీడిస్తున్న సికిల్‌సెల్ వ్యాధి నుంచి వారికి విముక్తి క‌ల్పించే ప్రణాళికను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తయారు చేయించారు. సికిల్‌సెల్ ఉచిత‌ రోగ నిర్ధారణ ప‌రీక్షలు సోమ‌వారం (జూన్ 26) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ‌లో సీఎం వైఎస్ జగన్.. మ‌రో గొప్ప య‌జ్ఞం ప్రారంభించారని ఆ శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మంత్రి విడదల రజినీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సికిల్సెల్ కేసులు అనేవే ఉండ‌కూడ‌దనే ల‌క్ష్యంతో జ‌గ‌న‌న్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. జ‌న్యు లోపం వ‌ల్ల వ్యాపించే ఈ వ్యాధి గిరిజ‌నుల‌ను త‌ర‌త‌రాలుగా ప‌ట్టిపీడిస్తోంది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ఏఎస్ఆర్, మ‌న్యం జిల్లాల‌తో పాటు నంద్యాల‌, ప్రకాశం, ప‌ల్నాడు, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 40 ఏళ్ల లోపు వారంద‌రికీ సికిల్‌సెల్ ప‌రీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది.


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,90,277 మందికి సికిల్‌సెల్ నిర్ధారణ ప‌రీక్షలు చేయాల‌ని నిర్దేశించుకున్నామ‌ని మంత్రి విడదల రజినీ తెలిపారు. వ‌చ్చే మూడేళ్లలో వీరంద‌రికీ సికిల్‌సెల్ నిర్ధారణ ప‌రీక్షలు పూర్తి చేస్తామ‌ని ఆమె వెల్లడించారు. ఒక్కో ఏడాదికి ఆరున్నర లక్షల మంది చొప్పున మూడేళ్లలో అంద‌రికీ ప‌రీక్షలు పూర్తి చేస్తామ‌ని మంత్రి తెలిపారు. అందుకోసం అవ‌స‌ర‌మైన అన్ని కిట్లనూ కొనేలా ముఖ్యమంత్రి జగన్ చ‌ర్యలు తీసుకున్నార‌ని ఆమె వివ‌రించారు. వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి చికిత్స అందిస్తారని.. దేశంలో ఈ రకమైన ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని మంత్రి అన్నారు.


టెస్టులు నిర్వహించిన తర్వాత ఎవ‌రికైనా సికిల్‌సెల్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, వారికి తగిన చికిత్స, మెడిక‌ల్ కౌన్సెలింగ్ ఇస్తామ‌ని మంత్రి విడదల రజిని చెప్పారు. అవ‌స‌ర‌మైన ముందులు ఉచితంగా అంద‌జేస్తామ‌న్నారు. 2047 క‌ల్లా రాష్ట్రంలో సికిల్‌సెల్ లేకుండా చేయాల‌నే ల‌క్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ‘రాష్ట్రంలో ఐదు చోట్ల ఇంటిగ్రేటెడ్ సెంట‌ర్స్ ఫ‌ర్ హిమోగ్లోబినోపాథిస్ ప‌రీక్షల ప్రయోగశాల‌ను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌ల ద్వారా నిరంత‌రం పరీక్షలు నిర్వహిస్తాం. పాడేరు జిల్లా ఆస్పత్రి, విశాఖ‌లోని కేజీహెచ్‌, కాకినాడ‌, గుంటూరు, క‌ర్నూలు ప‌ట్టణాల్లోని టీచింగ్ ఆస్పత్రల్లో ఈ ల్యాబ్‌ల‌ను అభివృద్ధి చేశాం’ అని మంత్రి తెలిపారు.


సికిల్‌సెల్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారంద‌రికీ సీఎం జగన్.. రూ.10 వేల చొప్పున పింఛ‌న్ అందజేస్తున్నారని మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1800 మంది బాధితులు ఈ పింఛ‌న్ మొత్తాన్ని పొందుతున్నార‌ని మంత్రి వెల్లడించారు. ‘దీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారంద‌రికీ జ‌గ‌న‌న్న పూర్తి అండ‌గా ఉంటున్నారు. క్యాన్సర్ వ్యాధితో పాటు కిడ్నీ, గుండె త‌దిత‌ర ప్రాణాంత‌క రుగ్మతలకు వైద్యం పూర్తి ఉచితంగా అంద‌జేస్తున్నారు. వైద్య ఖ‌ర్చు మొత్తం ప్రభుత్వమే భ‌రిస్తోంది’ అని మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రాణాంత‌క వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నవారికి నెల‌కు రూ.10 వేలు చొప్పున ఆస‌రా పింఛ‌న్లు ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అని కొనియాడారు. ఈ పథకం కోసం ప్రతి నెలా రూ. 35 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆమె తెలిపారు.


గిరిజ‌న ప్రాంతాల్లో గతంలో వైద్య సేవ‌లు అత్యంత దారుణంగా ఉండేవ‌ని చెప్పిన మంత్రి విడదల రజిని.. ప్రస్తుతం సీఎం జగన్ గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ క‌న‌బ‌రుస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల‌కు 104, 108 వాహ‌నాల‌ను భారీగా పెంచిన ప్రభుత్వం త‌మ‌ద‌ని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులు ఇంటికే వ‌చ్చి వైద్య సేవ‌లు అందిస్తున్నారని వివరించారు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com