పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుందని, కు సంబంధించి ఒక విదేశీ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. కోరమండల్ సంస్థ ఆర్థిక సహకారంతో మింది జిల్లా పరిషత్ హైస్కూల్లో సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో ఆధునికరించిన సైన్స్ ల్యాబ్ ను మంత్రి అమర్నాథ్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ వివిధ కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద మంజూరు చేసే నిధులతో గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలలో టాయిలెట్లు, స్కూలు ప్రహరీ గోడలు నిర్మించేందుకు, బెంచీలు కొనుగోలు చేసేందుకు వినియోగించేవారిని, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే నాడు నేడు పథకం కింద పాఠశాలల సంపూర్ణ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. నాడు నేడు పథకం కింద రాష్ట్రంలో 45 వేల పాఠశాలలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అమర్నాథ్ చెప్పారు.
గత ఏడాది ఎనిమిదో తరగతి చదువుతున్న ఐదు లక్షల మంది విద్యార్థులకు ట్యాబులు అంద చేశామని, ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు ట్యాబులు అందజేస్తామని అమర్నాథ్ చెప్పారు. నేటి విద్యార్థులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యకు ఇంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ కోరమండల్ సంస్థ మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేటర్ గుడివాడ అనూష మాట్లాడుతూ పిల్లల అభ్యున్నతికి కోరమండల్ సంస్థ అందజేస్తున్న సహకారాన్ని అభినందించారు. కోరమండల్ సంస్థ హెచ్. ఆర్ హెడ్ ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధిని తమ సంస్థ సామాజిక బాధ్యతగా తీసుకుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో 62వ వార్డు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి గుడివాడ లతీష్, మండల విద్యాశాఖ అధికారి సునీల్, కోరమండల్ సంస్థ సి ఎస్ ఆర్ హెడ్ జయగోపాల్ తదితరులు పాల్గొన్నారు.