గతవారం తిరుగుబాటు చేసిన తన పెంపుడు సైన్యం వాగ్నర్ గ్రూప్‌నకు చెల్లింపులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బయటపెట్టారు. కేవలం ఏడాదిలోనే దాదాపు రూ.8వేల కోట్లకుపైగా చెల్లించినట్లు ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొన్న వాగ్నర్ గ్రూపు సైనికులకు వేతనాలు, ఇతర రివార్డులో రూపంలో వీటిని అందజేసినట్టు పుతిన్ పేర్కొన్నారు. రక్షణశాఖ అధికారులతో మాస్కోలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు ఈ వివరాలను వెల్లడించారు.
‘మే 2022 నుంచి మే 2023 మధ్య కాలంలో వాగ్నర్ గ్రూపు సిబ్బంది జీతాలు, ఇతర అలవెన్సుల రూపంలో 86.26 బిలియన్ రూబుల్స్‌ను (దాదాపు ఒక బిలియన్ డాలర్లు) ప్రభుత్వం చెల్లించింది.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో పాల్గొన్న వారికి అన్ని వనరులు, సౌకర్యాలను ప్రభుత్వమే సమకూరుస్తోంది. వీటిని రక్షణశాఖ, ప్రభుత్వ బడ్జెట్ నుంచే అందజేస్తున్నాం.. మనమే ఆ గ్రూపునకు పూర్తిగా నిధులు సమకూర్చాం’ అని రక్షణశాఖ అధికారులకు వ్లాదిమిర్ పుతిన్ వివరించారు.
ఇదే సమయంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవిజినీ ప్రిగోజిన్ సంపాదనపై దర్యాప్తు చేపట్టనున్నట్టు పుతిన్ ప్రకటించారు. అతడు బిలియన్ రూబిళ్లను సంపాదించాడని.. వాగ్నర్ గ్రూపుతోపాటు వారి చీఫ్‌కి చెల్లించిన డబ్బు ఎలా ఖర్చయ్యిందో నిగ్గుతేలుస్తామని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తిరుగుబాటు అంశాన్ని పుతిన్ ప్రస్తావించారు. ఒకవేళ అది విజయవంతమైతే మాత్రం మన శత్రువులు దాన్ని అవకాశంగా మలచుకునేవారని అన్నారు. దాంతో కొన్నేళ్లుగా సాధించిన విజయాలను కోల్పోయేవాళ్లమని అభిప్రాయపడ్డారు.
అనేక ఆఫ్రికన్, మధ్యప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలు సహా మాస్కో ప్రయోజనాల కోసం పనిచేస్తోన్న కిరాయి సైన్యం వాగ్నర్ ఉనికిని రష్యా గతంలో ఖండించింది. కానీ, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా దాడిలో కీలకంగా మారినప్పటి నుంచి వాగ్నర్ గ్రూప్‌ను మాస్కో ధ్రువీకరించింది. గతవారం రష్యా పై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్.. రోస్తోవ్ ఆన్ డాన్‌ను వీడి తిరిగి బెలారస్‌కు వెళ్లారు. ఆయనతో పాటు ప్రైవేట్ సైన్యం తిరిగి సరిహద్దులోని వాటి స్థావరాలకు వెళ్లాయని రష్యా అధికారులు తెలిపారు. ప్రిగోజిన్‌పై నమోదైన క్రిమినల్ కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పెంచి పోషించిన యవ్జెనీ ప్రిగోజిన్ ఆయనపైనే తిరుగుబాటు చేశారు. రష్యా నాయకత్వాన్ని, కూలదోసి, కొత్త అధ్యక్షుడిని నియమిస్తామంటూ జూన్ 24న ప్రతిజ్ఞ చేశారు. చావడానికైనా చంపడానికైనా సిద్ధమని లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa