కైకలూరులో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం స్థానిక దానెగూడెంకు చెందిన పుట్ట సౌందర్య (35) కైకలూరు బ్రహ్మంగారి గుడివీధిలో నివాసముంటోంది. పదేళ్ల క్రితం భర్తకు విడాకులిచ్చి ఆమె తన కుమారుడితో జీవిస్తూ కైకలూరులోని ఓ ప్రైవేటు బంకులో పనిచేస్తోంది. లోకుమూడి గ్రామానికి చెందిన ఆగోళ్ళు జాన్సన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన జాన్సన్ ఆమెతో సహ జీవనం చేశాడు. పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించడంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. నిందితుడు సౌందర్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కైకలూరు టౌన్ ఎస్సై జ్యోతి బసు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.