దేశంలో ఇంటర్నెట్ కారణంగా యువతీ, యువకులు 14 ఏళ్లకే యుక్త వయసుకు చేరుకుంటున్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో బాలికలు శృంగారానికి సమ్మతి తెలిపే వయసును ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ ధర్మాసనం అభిప్రాయం వెల్లడించింది. 2020 లో ఓ 20 ఏళ్ల యువకుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని 16 ఏళ్ల బాలిక దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
బాలికల శృంగార సమ్మతి వయసు 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని చేస్తున్న సూచనకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు కొన్ని విషయాలను కూడా వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో యువకులకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించింది. అందుకే టీనేజ్ బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు 2020 లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 16 ఏళ్ల బాలిక హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు వాదనల్లో భాగంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
ఓ 20 ఏళ్ల వ్యక్తి తనను పదే పదే అత్యాచారం చేసి.. తాను గర్భం దాల్చడానికి కారణమయ్యాడంటూ 16 ఏళ్ల బాలిక సదరు యువకుడిపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. యువకుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను జూన్ 27 వ తేదీన కొట్టివేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. అయితే సదరు బాలికకు యువకుడు ట్యూషన్ చెప్పేవాడని కేసు ప్రకారం తెలుస్తోంది. అయితే 2020 లో ఒక రోజు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తనకు ఇచ్చి అత్యాచారం చేశాడని బాలిక కేసు పెట్టింది. అయితే ఆ అత్యాచారాన్ని వీడియో తీసి.. ఆ యువకుడు తనను పదే పదే బెదిరిస్తూ.. పలు మార్లు రేప్ చేసినట్లు ఆరోపించింది. ఈ ఘటన తర్వాత ఆ బాలికకు తన సన్నిహిత బంధువుతోనూ శారీరక సంబంధం ఉన్నట్లు తేలిందని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే యువకుడిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియా, ఇంటర్నెట్ వల్ల బాలబాలికలకు 14 ఏళ్ల వయసులోనే యుక్త వయసుకు చేరుకుంటున్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు. టీనేజీలోనే బాలబాలికలు పరస్పర శారీరక ఆకర్షణలకు లోనవుతున్నారని వెల్లడించారు. అయితే లైంగిక చర్యల్లో ఇద్దరి తప్పు ఉన్నా.. బాలురు మాత్రమే నేరారోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో శృంగారానికి సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సూచించారు. నిజానికి ఇండియన్ పీనల్ కోడ్‌ను సవరించక ముందు శృంగారానికి సమ్మతి వయసు 16 ఏళ్లుగానే ఉండేదని గుర్తు చేశారు. దాన్ని పునరుద్ధరించడం వల్ల బాలురకు అన్యాయం జరగకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు.