మెయితీ, కుకీ తెగల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం రెండు నెలలుగా హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. మణిపూర్‌లో ఉద్రిక్తతల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ హింసాత్మక ఘటనలు మొత్తం ముందస్తు ప్రణాళిక ప్రకారమే పక్కాగా అమలు చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా బీరెన్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఓ పక్క మణిపూర్ అల్లకల్లోలం అవుతుంటే.. హస్తం పార్టీ మాత్రం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ అజెండాతోనే మణిపూర్‌లో పర్యటిస్తుంచారని బీరేన్ సింగ్ ఆరోపించారు.
దేశానికి సరిహద్దున ఉన్న రాష్ట్రం కారణంగా విదేశీ శక్తుల కుట్రలతో మణిపూర్ అతలాకుతలం అవుతోందని బీరెన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మయన్మార్‌తో మణిపూర్ సరిహద్దులు పంచుకుంటోందని.. చైనా కూడా కేవలం 398 కిలోమీటర్ల దూరంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. మణిపూర్ సరిహద్దులు పూర్తిగా తెరిచే ఉంటున్నాయని.. అక్కడ సైనిక బందోబస్తు కూడా తక్కువేనని పేర్కొన్నారు. మణిపూర్ సరిహద్దుల్లో సైనిక బలగాలు ఉన్నప్పటికీ.. విశాలమైన ప్రాంతాన్ని అణువణువునా పర్యవేక్షించడం సాధ్యం కాదని తెలిపారు. ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి ఎలాంటి అంశాన్ని కొట్టి పారేయలేం. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ముందస్తు ప్రణాళికలతోనే అల్లర్లు జరుగుతున్నట్లు అనిపిస్తోందని బీరెన్ సింగ్ వెల్లడించారు. తాను ఇప్పటికే కుకీ సోదర సోదరీమణులతో ఫోన్‌లో మాట్లాడానని.. జరిగిన దానికి క్షమించి.. వదిలేయాలని కోరినట్లు మణిపూర్ సీఎం తెలిపారు.
మరోవైపు.. మణిపూర్‌లో హింస ఏ మాత్రం ఆగడం లేదు. శనివారం అర్ధరాత్రి జరిగిన హింసలో కుజూమా ఆదివాసీ గ్రామంలో మెయితీ వర్గానికి చెందిన ముగ్గురిని కుకీ మిలిటెంట్లు కాల్చి చంపారు. అయితే ఈ ఘటనలో మరింత మంది మరణించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆ గ్రామంలో భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. చనిపోయిన వారి మృతదేహాలను ఇంఫాల్ తీసుకొచ్చి ఆందోళన చేయాలని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన మెయితీలు డుంప్‌కీ కుకీ గ్రామాన్ని దహనం చేశారు.
ఈ క్రమంలోనే మణిపూర్‌లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోని ఇంఫాల్ లోని తన నివాసం నుంచి రాజ్‌భవన్‌కు బయల్దేరారు. ఈ నిర్ణయాన్ని ఆయన మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకుని.. రాజీనామా చేయడం లేదని బీరెన్ సింగ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.