ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబాయ్ కు షాక్.... మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్

national |  Suryaa Desk  | Published : Sun, Jul 02, 2023, 09:56 PM

మహారాష్ట్రలో రాజకీయం మరోసారి రంజుగా మారింది. రాజకీయ వర్గాలు ఊహించనట్లుగానే జరిగింది. ఎన్సీపీలో అంసతృప్తిగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్.. మరోసారి తిరుగుబాటు జెండా ఎత్తారు. తన మద్దతు ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఎన్సీపీలో మరోసారి చీలిక తెచ్చారు. ఈ మేరకు తన మద్దతుదారులతో కలిసి.. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ - షిండే శివసేన కూటమి నేతృత్వంలో ఉన్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ సహా మరో 9 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.


ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను అజిత్ పవార్ కలిశారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది శాసనసభ సభ్యులు ఉండగా.. అందులో 30 మంది అజిత్ పవార్ వెనకాల ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం అంతా కలిసి రాజ్‌భవన్ వెళ్లి అక్కడ గవర్నర్ రమేశ్ బైస్‌ను కలిశారు. అనంతరం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా.. మిగితా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.


అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో విడిగా అజిత్‌ పవార్‌ తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. అయితే ఇటీవల అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించడం.. ఆ తర్వాత మద్దతు దారుల ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగిందే. అయితే ఆ తర్వాత పార్టీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను శరద్ పవార్ నియమించారు. అందులో ఒకరు శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే కాగా.. మరొకరు పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్. అయితే కీలక పదవుల నుంచి తనను పక్కకు పెట్టారని అజిత్ పవార్‌.. అప్పటి నుంచి గుర్రుగా ఉన్నారు. సరైన సమయం చూసి ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవ వేశారు.


అయితే ఎన్సీపీలో, మహారాష్ట్ర రాజకీయాల్లో ఇన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. అజిత్ పవార్ నివాసంలో ఎన్సీపీ నేతలు సమావేశం కావడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఎమ్మెల్యేలను అజిత్ పవార్ ఎందుకు పిలిచారో తనకు తెలియదు కానీ.. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నందున.. వారిని భేటీకి పిలిచే హక్కు అజిత్ పవార్‌కు ఉంటుందని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com