మహారాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఇటీవలి కాలంలో మహా రాజకీయాల్లో అజిత్ పవార్ స్థానం విచిత్రమైంది. తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్.. గత మూడున్నరేళ్లలో మూడు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ మూడు సార్లు ముఖ్యమంత్రి పీఠంపై ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఉండటం గమనార్హం. దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేలు సీఎంలుగా ఉన్న సమయంలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తొలుత 2019 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్సీపీలో తొలిసారి తిరుగుబాటు జెండా ఎగురవేసిన అజిత్ పవార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. దీంతో అజిత్ పవార్ సాయంతో ఎన్సీపీలో చీలిక తెచ్చిన బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రెండు రోజులు కూడా ఫడ్నవీస్ సర్కార్ కుప్ప కూలింది.
ఆ సమయంలో చక్రం తిప్పిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. అజిత్ పవార్‌ను వెనక్కి రప్పించారు. అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు.. మహా వికాస్ ఆఘాఢీగా ఏర్పడి 2019 డిసెంబర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సమయంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. మరోసారి ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు.
అయితే శివసేన పార్టీలోని ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహావికాస్ ఆఘాఢీ కూటమి పడిపోయింది. శివసేనలోని దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే.. బీజేపీతో జట్టు కట్టాడు. దీంతో ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే.. ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహా వికాస్ ఆఘాఢీ ప్రతిపక్షంలోకి చేరగా.. మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా మరోసారి ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్.. మరోసారి బీజేపీ పంచన చేరారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సర్కార్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మరోసారి అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. దీంతో ముచ్చటగా మూడోసారి ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.