రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అందుతున్న వినతులను 15 రోజుల్లో పరిష్కరించాలని కడప కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో ప్రతి ఇంటికెళ్లి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు 1 వరకు ప్రతి వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో క్యాంపులు ఏర్పాటు చేసి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రతి విన్నపాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. అధికార బృందాలు ఆయా వార్డుల్లో సందర్శించి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వాటిని వెంటనే ఆన్లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. అభ్యర్థనలు అందిన 15 రోజుల్లో వారు కోరిన ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారునికి అందజేయాలన్నారు. శిక్షణ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్వో గంగాధర గౌడ్, ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు ఆనంద్ నాయక్, కృష్ణయ్య, వెంకట్రావు, సుధాకరరెడ్డి, యధుభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.