ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగా కులం, మతం, పార్టీలకు అతీతం,,,,అభిమానులంతా ఐక్యత చూపాలి: వంగవీటి రాధా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 04, 2023, 07:32 PM

వంగవీటి మోహనరంగా 76వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి తనయుడు వంగవీటి రాధాకృష్ణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, జనసేన నేతలు పోతిన వెంకట మహేష్, రామకృష్ణ, అక్కల గాంధీ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ కేక్ కట్ చేసి రాధా రంగ మిత్ర మండలి సభ్యులకు తినిపించారు. తన తండ్రి రంగాను కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరూ గుండెల్లో పెట్టుకున్నారన్నారు రాధా.


ఒక మనిషి భౌతికంగా దూరమైనా కొన్ని తరాలకు స్ఫూర్తిని ఇచ్చారని.. నేటికీ రంగాను దేవుడిగా ఆదరించడం, ఆయన చేసిన మంచిని చెబుతుందన్నారు. భవిష్యత్తులో రంగా అభిమానులు అందరూ ఐకమత్యం చూపాలని.. రంగా పేరు చెప్పుకుని నాయకులుగా ఎదిగారన్నారు. వారు పట్టించుకోక పోయినా.. ప్రజల మనసుల్లో రంగా ఉన్నారన్నారు. రంగా పేరు చెప్పుకునే పాలకులే.. ఆయన పేరు జిల్లాకు ఎందుకు పెట్ట లేదో‌ చెప్పాలన్నారు.


1987లో తన తండ్రి రంగా చైతన్య రథం సినిమా నిర్మించారని గుర్తు చేసుకున్నారు. అభిమానులు ఎంతోకాలం గా ఆ సినిమా కోసం ఎదురు‌ చూస్తున్నారని.. ఒక ప్రింట్ దొరికితే దానిని సరి చేసి పూర్తి స్థాయిలో ఆధునీకరించారని.. ఈరోజు రంగా జయంతి సందర్భంగా అమెరికాలో రిలీజ్ చేశారన్నారు. సాంకేతిక అంశాలు పూర్తి చేసుకుని త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. లాభాపేక్ష లేకుండా సోషల్ మీడియాలో ఉచితంగా సినిమాను అందరూ చూసేలా చేస్తామన్నారు.


రంగాను ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోక పోయినా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు జనసేన నేత పోతిన వెంకట మహేష్. రంగా తనయుడు రాధాకృష్ణకు జగన్ రాజకీయంగా వెన్నుపోటు పొడిచారన్నారు. తనను మోసం చేసిన వారందరికి రాధాకృష్ణ రాజకీయ సమాధి కడతారని.. రంగాకు అసలైన వారసుడు రాధాకృష్ణ మాత్రమే అన్నారు. రాధా వైఎస్సార్‌సీపీలో ఉన్న సమయంలో జగన్ రంగా జయంతి, వర్ధంతి నిర్వహించారని.. మరి ఇప్పుడు అదే జగన్ రంగాకు నివాళి ఎందుకు అర్పించడం లేదని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా రాధాకృష్ణ రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.


ఎన్నికల సీజన్ రావడంతో రంగా పేరు చెప్పి నటిస్తున్నారని, జీవిస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే రంగా పేరుతో పధకం గానీ,‌ జిల్లా పేరు కానీ పెట్టించాలని డిమాండ్ చేశారు. జగన్ అన్ని పథకాలు ఎత్తేసి అందరినీ మోసం చేశారన్నారు. రంగా పేరు చెప్పి ఓట్లు వేయించుకున్న పాలకులు జగన్‌ను నిలదీయాలన్నారు. రంగా పేరు చెప్పకుండా ఏ రాజకీయ పార్టీలు, పార్టీ కూడా రాజకీయం చేయలేదన్నారు. ఆయన స్పూర్తితో సమస్యలపై అనేక మంది పోరాటం చేస్తున్నారన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com