ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెన్నుపోటు వీరుడంటూ బాబుపై సీఎం జగన్ సెటైర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 04, 2023, 07:32 PM

వెన్నుపోటు వీరుడు చంద్రబాబు అంటూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరులో పర్యటించారు. రూ. 385 కోట్లతో చేపడుతున్న చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్‌, ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2024 ఏప్రిల్‌ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో డెయిరీ కార్యాచరణ సిద్ధమైంది. ఈ డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది.


చంద్రబాబు హెరిటేజ్‌ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి జగన్‌ మండిపడ్డారు. తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని.. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం.. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు. చంద్రబాబు చంద్రగిరిలో గెలవలేనిని కుప్పం వలస వెళ్లారని ఎద్దేవా చేశారు జగన్. చంద్రబాబు గురించి అర్థం చేసుకున్న కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారని.. మళ్లీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారన్నారు. ఈ 75 ఏళ్ల ముససలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానని డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.


చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందని. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్‌ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యం కలిగిందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చామని.. రూ.182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్‌ చేస్తున్నామన్నారు. అమూల్‌ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది అన్నారు. ఈ డెయిరీ ద్వారా చిత్తూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులకు మేలు జరుగుతుందన్నారు సీఎం. అమూల్‌ రాక ముందు లీటర్‌ గేదె పాల ధర రూ.67 ఉంటే.. అమూల్‌ వచ్చాక లీటర్‌ గేదె పాల ధర 89 రూపాయల 76 పైసలకు పెరిగిందన్నారు. ఆవుపాల ధర కూడా భారీగా పెరిగిందన్నారు.


చంద్రబాబు గతంలో 54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను అమ్మేశారని.. తన మనుషులకు తక్కువ ధరకు సంస్థలను కట్టబెట్టేశారని ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచిన సంగతి ఇప్పటి తరానికి తెలియదని చంద్రబాబు నమ్మకమని.. తన ముడుపుల కోసం ప్రభుత్వ సంస్థలను అమ్మేసే చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు. పప్పు బెల్లాల కోసం అన్నీ చంద్రబాబు తన వారికి కట్టబెట్టారని.. చంద్రబాబు మంచిని నమ్ముకోకుండా మోసాని నమ్ముకున్నారన్నారు. తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయని.. విష ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. వెల్లూరు మెడికల్‌ కాలేజ్‌ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని.. వెల్లూరు మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి ఈ ప్రభుత్వం పునాది వేసిందన్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి కూడా లేదన్నారు.


చిత్తూరు డెయిరీని తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యూనిట్‌ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ. 150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్‌మెంట్‌ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com